వైభవ్‌ అతి త్వరలో జాతీయ జట్టుకు ఎంపికవుతాడు: సంగక్కర

ఈ ఐపీఎల్‌ సీజన్లో చక్కటి ఆటతీరుతో ఎందరో క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపు మరల్చుకున్న వైభవ్ సూర్యవంశీపై ఆర్ఆర్ కోచ్ కుమార సంగక్కర ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు త్వరలోనే జాతీయ జట్టుకు ఎంపికవుతాడని కితాబిచ్చాడు.

ఐపీఎల్ 2026 టైటిల్ వేటలో రాజస్థాన్ రాయల్స్ చివరి మెట్టుపై బోల్తాపడినప్పటికీ.. క్వాలిఫయర్ 2 వరకు ఆ జట్టు యువ ఆటగాళ్లు ప్రదర్శించిన పోరాటపటిమపై ఆర్ఆర్ హెడ్‌కోచ్ కుమార సంగక్కర గర్వంగా ఫీలయ్యాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘టీమ్ఇండియా తరఫున ఆడేందుకు వైభవ్ సిద్ధంగా ఉన్నాడా?’ అనే ప్రశ్న ఎదురవగా.. దానికి అతడు ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు.

ఓ ఆటగాడికి ఇంటర్నేషనల్ క్యాప్ అందేవరకు వారు దానికి అర్హులో కాదో కచ్చితంగా చెప్పలేమన్నాడు సంగక్కర. కానీ ఈ ఐపీఎల్‌లో సూర్యవంశీ ప్రపంచంలోని కొందరు అత్యుత్తమ బౌలర్లను చితకబాదడం చూశాక అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుందన్నాడు. ‘ఓ ఆటగాడు ఆడేంత వరకు అతడు సిద్ధంగా ఉన్నాడో లేదో చెప్పలేం. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లపై వైభవ్ ప్రదర్శించిన ఆటతీరు చూస్తే.. ఎలాంటి సవాలునైనా స్వీకరించేందుకు అతను పూర్తి సిద్ధంగా ఉన్నాడనిపిస్తోంది. అతడికి అతి త్వరలోనే జాతీయ జట్టులోకి పిలుపు వస్తుందనే నమ్మకం నాకుంది. అంతటి పరిణతితో అతడి బ్యాటింగ్ సాగింది. ఈ సీజన్‌లో ఓపెనర్‌గా తన బాధ్యతను చాలా చక్కగా నెరవేర్చాడు వైభవ్’ అని సంగక్కర అన్నాడు.

‘సూర్యవంశీ విషయంలో మా దగ్గర ఓ ప్రణాళిక ఉంది. మేం అతణ్ని ఎక్కువగా ఒత్తిడికి గురిచేయం. అతడు చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తాడు. బౌలర్లను అంచనా వేయడంలో వారి వీడియోలను చూసి, తనను తాను సిద్ధం చేసుకుంటాడు. కాబట్టి మేం అతణ్ని అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలనుకుంటున్నాం. అతడు ఇదే స్పష్టమైన అవగాహన, ధైర్యంతో మున్ముందూ బ్యాటింగ్ కొనసాగించాలని కోరుకుంటున్నాం’ అని శ్రీలంక మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

ఈ ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించిన సూర్యవంశీ.. ఆరెంజ్ క్యాప్‌తో ఈ సీజన్‌ను ముగించాడు. అయితే.. ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(722), సాయి సుదర్శన్ (710).. వైభవ్‌ను అధిగమించే అవకాశం ఉంది.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *