తిరుమలలో రద్దీ క్రమంగా పెగరుతోంది.. భక్తుల క్యూ లైన్లలో బారులు తీరి కనిపిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది.. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థలాన్ని గుర్తించి అవసరమైన ప్రణాళికలల్ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందంటున్నారు.
తిరుమలలో ప్రతి ఏటా రద్దీ పెరుగుతూనే ఉంది.. ముఖ్యంగా పండగలు, బ్రహ్మోత్సవాలు, ముఖ్యమైన రోజులు, వేసవి సెలవుల్లో రద్దీ ఎక్కవగా ఉంటోంది. ముఖ్యంగా వేసవి కాలంలో మార్చి నెల నుంచి జులై నెల వరకు రద్దీ తీవ్రత కొనసాగుతోంది. కొండపై భక్తుల రద్దీ పెరుగుతుండటంతో టీటీడీ ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. తిరుమలలో కొత్తగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
భక్తుల రద్దీ పెరిగిన సమయంలో తిరుమలలోని క్యూ కాంప్లెక్స్-1, క్యూ కాంప్లెక్స్ – 2లు నిండిపోతున్నాయి. నారాయణగిరి షెడ్లు నిండిపోయి.. భక్తుల క్యూలైన్లు శిలాతోరణం, గోగర్భం డ్యామ్ వరకు ఉంటోంది. అందుకే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మించాలని టీటీడీ భావిస్తోంది.

