
రెండో విడత పంచాయతీ ఎన్నికలు. ముగిసిన నామినేషన్ల ఘట్టం
-గ్రామాల్లో రాజకీయ సందడి. సర్పంచ్, వార్డు స్థానాలపై పార్టీల దృష్టి
రాష్ట్రవార్త-తెనాలి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. తెనాలి మండల పరిధిలోని పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్సార్సీపీ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అంగలకుదురు, చావావారిపాలెం, బుర్రిపాలెం, నేలపాడు, తేలప్రోలు, జగ్గడిగుంటపాలెం, మల్లెపాడు, కంచర్లపాలెం, సోమసుందరపాలెం, ఎరుకలపూడి, కఠెవరం, కొలకలూరు, హాఫ్‌పేట, నందివెలుగు, పెదరావూరు, గుడివాడ, కోపల్లె, సంఘం జాగర్లమూడి తదితర గ్రామాల్లో నామినేషన్ల సందర్భంగా రాజకీయ సందడి నెలకొంది. అభ్యర్థులు తమ అనుచరులు, మద్దతుదారులతో కేంద్రాలకు చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గ్రామస్థాయిలో అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకుల మద్దతు, సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత పరిచయాలు, గ్రామాభివృద్ధిపై ఇచ్చే హామీలు ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా సర్పంచ్ స్థానాల పోటీతో పాటు వార్డు సభ్యుల స్థానాలపైనా రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈక్రమంలో నేలపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి బుర్రిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని హామీ ఇచ్చారు. తనతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఆ తర్వాత ప్రచార పర్వం ఊపందుకోనుండటంతో గ్రామాల్లో రాజకీయ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
