గుంటూరు (రాష్ట్ర వార్త ప్రతినిధి):
సొంత ఊరిలో ఉన్నత విద్య చదువుకోవడానికే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న ఈ రోజుల్లో, ఒక నిరుపేద కుటుంబానికి చెందిన గ్రామీణ యువకుడు తన అసాధారణ పట్టుదలతో విద్యా రంగంలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు. తెనాలి మండలం కోపల్లె గ్రామానికి చెందిన బురదగుంట సతీష్.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) నుండి ప్రతిష్టాత్మక పీహెచ్డీ (Ph.D) పట్టా సాధించి తన గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
రాజధాని ప్రాంత పర్యావరణంపై విస్తృత పరిశోధన
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ సైన్స్ విభాగంలో, ప్రముఖ ఆచార్యులు డా. బ్రహ్మాజీరావు పర్యవేక్షణలో సతీష్ తన పరిశోధనలను పూర్తి చేశారు.
**”Identification of microbes from dump yards soil and sewage water and their Bacteriological studies at the capital region of Andhra Pradesh”
(ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని వ్యర్థాల మైదానాల నేల మరియు మురుగునీటిలోని సూక్ష్మజీవుల గుర్తింపు – వాటి బ్యాక్టీరియాలజీ అధ్యయనం) అనే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంపై ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి వర్సిటీ పీహెచ్డీ ఖరారు చేసింది.
పరిశోధనలోని ముఖ్యాంశాలు:
పరిశోధనలో భాగంగా సతీష్ రాజధాని ప్రాంతంలోని వ్యర్థాల మైదానాలు, మురుగునీటి వ్యవస్థలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. డంప్యార్డుల నుండి విడుదలయ్యే ప్రమాదకర ద్రవాలు నేలలో కలవడం వల్ల భూగర్భ జలాలు, మురుగునీరు కలుషితమై హానికర సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతున్నాయని ఆయన నిరూపించారు. పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే Pseudomonas, E.coli వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు మనుషులు, జంతువులు మరియు మొక్కల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని.. ఇవి గాలి ద్వారా కూడా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వ్యాపిస్తాయని తన పరిశోధనలో వెల్లడించారు.
శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణే ఏకైక మార్గం
ఈ సందర్భంగా పరిశోధకుడు బురదగుంట సతీష్ మాట్లాడుతూ.. తన పరిశోధన సమాజానికి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే కాకుండా, ప్రభుత్వాలు వ్యర్థాల నిర్వహణకు సరైన ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. వ్యర్థాలను పాత పద్ధతుల్లో కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయడం ద్వారానే పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని ఆయన సూచించారు.
గ్రామంలో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
కూలి పనులు చేసుకునే అత్యంత సాధారణ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి, పట్టుదలతో పీహెచ్డీ వంటి అత్యున్నత డిగ్రీ సాధించడం పట్ల కోపల్లె గ్రామ ప్రజలు, సతీష్ మిత్రులు మరియు ప్రజా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు ఆదర్శంగా నిలిచిన డాక్టర్ బురదగుంట సతీష్ భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి సమాజానికి మరింత సేవ చేయాలని మేధావులు, అధ్యాపకులు ఆకాంక్షించారు.



