రైలు ప్రమాదంలో వృద్ధుడు మృతి
తెనాలి రైల్వే పరిధిలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తెనాలి రేపల్లె మార్గంలో ప్యాసింజరు రైలు ఢీకొనడంతో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తిని అదే రైలులో రేపల్లెకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రి శవాగారంలో ఉంచారు.
సమాచారం అందుకున్న తెనాలి జిఆర్పి ఎస్సై సరస్వతి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు పెనుమర్రు, వేమూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కావచ్చని, అతని వయస్సు సుమారు 60 నుంచి 62 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటనపై ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సరస్వతి వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

