-ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై జనసేన నేత గల్లా శ్రీనివాసరావు ఆరోపణలు

రాష్ట్రవార్త-పెందుర్తి: ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని జనసేన నాయకుడు, మార్కెటింగ్ కమిటీ సభ్యుడు గల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 88వ వార్డులో జరుగుతున్న పలు నిర్మాణ పనుల తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కాల్వల నిర్మాణాన్ని చేపట్టకుండా, ఇప్పటికే సక్రమంగా ఉన్న కాల్వలను తొలగించి కొత్త నిర్మాణ పనులు చేపట్టడం వెనుక భారీగా అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పనులు చేపట్టడం కారణంగా ప్రభుత్వ నిధులు లక్షల రూపాయల్లో వృథా అవుతున్నాయని ఆరోపించారు.
అంతేకాకుండా ప్రైవేటు లే అవుట్లకు సైతం కార్పొరేషన్ నిధులతో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన నిధులను ప్రైవేటు ప్రయోజనాలకు ఉపయోగించడంపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ వ్యవహారాలన్నింటి వెనుక ఓ మాజి కార్పొరేటర్ హస్తం ఉన్నట్లు ఆయన ఆరోపించారు. నిర్మాణ పనుల ఎంపిక, నిధుల వినియోగం, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై సమగ్రంగా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
ప్రజా ధనానికి కాపలాదారులుగా ఉండాల్సిన అధికారులు, నిధుల వినియోగంపై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆయన తెలిపారు. 88వ వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి, నిధుల వినియోగం, పనుల అవసరం, నాణ్యతపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని గల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

