
శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి రూ.46.42 లక్షల సిఎస్‌ఆర్ నిధులు
గోపాలపట్నం: సామాజిక బాధ్యతలో భాగంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి (సిఎస్‌ఆర్) నిధుల నుంచి శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి రూ.46.42 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో నిరంతర వైద్య సేవలకు అవసరమైన 500 కెవిఎ జనరేటర్ ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పటికీ కీలక నిర్ధారణ పరీక్షలు, శస్త్రచికిత్సలు, రోగుల సంరక్షణ సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది. తద్వారా వేలాది మంది రోగులకు అందుతున్న కంటి వైద్య సేవల నాణ్యత, విశ్వసనీయత మరింత మెరుగుపడుతుందని శంకర్ ఫౌండేషన్ డిప్యూటి జనరల్ మేనేజర్ కె. బంగారు రాజు తెలిపారు.
ప్రాజెక్టు అమలులో భాగంగా మంజూరైన మొత్తం నిధుల్లో 50 శాతం మేర రూ.23.21 లక్షల తొలి విడత విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కార్యదర్శి ఎం. శంకర్‌బాబు, శంకర్ ఫౌండేషన్ డిప్యూటి జనరల్ మేనేజర్ (పిఆర్, కార్పొరేట్ రిలేషన్స్, లైజన్) కె. బంగారు రాజుకు అందజేశారు. పోర్ట్ అథారిటి అందించిన ఈ సహాయం ఆసుపత్రి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు, విద్యుత్ అంతరాయాల సమయంలో కూడా అత్యవసర కంటి వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రజారోగ్యానికి సిఎస్‌ఆర్ నిధులను వినియోగించడం ద్వారా సమాజ అవసరాలను తీర్చడంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటి చూపుతున్న నిబద్ధత అభినందనీయమని
శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, సిఈఓ ఎ. కృష్ణకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటి చైర్మన్ జస్మీత్ సింగ్ బింద్రా (ఐఆర్‌టీఎస్)కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
