Renowned dentist Dr. Kasturibai passes away.

ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్‌ కస్తూరిబాయి కన్నుమూత

-గుంటూరు జిల్లాలో తొలి మహిళా ప్రైవేట్‌ దంత వైద్యురాలిగా గుర్తింపు

-సామాజిక సేవ, రాజకీయ, ధార్మిక కార్యక్రమాల్లో విశేష సేవలు

రాష్ట్రవార్త-తెనాలి: తెనాలికి చెందిన ప్రముఖ దంత వైద్యురాలు, సామాజిక సేవకురాలు ముద్దన కస్తూరిబాయి (79) మంగళవారం కన్నుమూశారు. గుంటూరు జిల్లాలో ప్రైవేటుగా దంత వైద్యశాలను నిర్వహించిన తొలి మహిళా దంత వైద్యురాలిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు, వైద్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
డాక్టర్‌ కస్తూరిబాయి దివంగత మాజి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు హయాంలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తురాలిగా ఉంటూ మహిళా సమస్యలు, సామాజిక అంశాలపై చురుకుగా పనిచేశారు.
ఆమె సోదరుడు వాసిరెడ్డి హనుమంతరావు సంఘం డెయిరీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. కుటుంబం నుంచి వచ్చిన సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ డాక్టర్‌ కస్తూరిబాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేశారు.
తెనాలి కొత్తపేటలోని మహిళా మండలి భవన్‌ను మున్సిపాలిటీకి ఉదారంగా అప్పగించడంలో డాక్టర్‌ కస్తూరిబాయి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆ భవనం విలువ సుమారు రూ.6 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. అలాగే అమరావతి అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి రూ.3 లక్షలకు పైగా విరాళం అందించారు.
ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె నాయకత్వం వహించి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సభ్యురాలిగా కొనసాగుతూ పేదలకు ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించారు.
ఆమె భర్త డాక్టర్‌ ముద్దన కోటేశ్వరరావు నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా, వారిద్దరూ చాలాకాలంగా అమెరికాలో స్థిరపడ్డారు. వారిలో ఒకరు వైద్య వృత్తిలో ఉన్నారు.
డాక్టర్‌ కస్తూరిబాయి మృతితో తెనాలి ఒక సేవా తత్పరురాలైన ప్రముఖ మహిళను కోల్పోయిందని పలువురు పేర్కొన్నారు. ఆమె చేసిన వైద్య, సామాజిక సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. గురువారం ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

R

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 88

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *