Former YSRCP MLA Annabathuni Shivakumar alleges that the alliance committed irregularities in the local elections స్థానిక ఎన్నికల్లో కూటమి అక్రమాలకు పాల్పడింది: వైసీపీ మాజి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆరోపణ రాష్ట్రవార్త-తెనాలి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలకు పాల్పడిందని వైసిపి తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. గంగానమ్మపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో పోలీసులను, అధికారులను ఉపయోగించుకుని వైసిపి అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. పలువురు నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేశారని, వైసిపి ఏజెంట్లను బయటకు పంపించారని ఆరోపించారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో ఎన్నికల్లో పోరాడారని తెలిపారు. గతంలో టిడిపి, జనసేన స్థానిక ఎన్నికలకు దూరంగా ఉన్న సందర్భాలున్నా వైసిపి మాత్రం అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేసిందని గుర్తుచేశారు. ఎన్నికల అక్రమాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 2024 ఎన్నికలతో పోలిస్తే వైసిపి ఓటింగ్ శాతం పెరిగిందని, ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని పేర్కొన్నారు. కొల్లిపర మండలంలో జెడ్పిటిసి స్థానాన్ని వైసిపి గెలుచుకోవడం పార్టీ శ్రేణుల కృషికి నిదర్శనమన్నారు. తెనాలి మున్సిపాలిటీతోపాటు తెనాలి, కొల్లిపర మండలాల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు, అభిమానులకు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు మద్దాలి శేషాచలం, తాడిబోయిన రమేష్, గుంటూరు కోటేశ్వరరావు, కఠారి హరీష్తోపాటు వివిధ వార్డుల్లో పోటీ చేసిన వైసిపి కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.