రోడ్డుపై దొరికిన పర్సును అందులోని విలువైన వస్తువులు, నగదుతో సహా భద్రంగా పోలీసులకు అప్పగించి, అసలు యజమానికి చేరేలా చేసిన ప్రజాశక్తి తెనాలి రూరల్ కరస్పాండెంట్ అంబటి శ్యామ్ సాగర్ నిజాయితీని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. తెనాలిలోని స్థానిక మైత్రి ఆసుపత్రి సమీపంలో మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న అంబటి శ్యామ్ సాగర్‌కు రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. దానిని పరిశీలించగా రామలింగేశ్వరపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంగువ లీలా సాయి వెంకటేశ్వర శాస్త్రికి సంబంధించినదిగా గుర్తించారు. పర్సులో ఆధార్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు కొంత నగదు కూడా ఉంది.
దీంతో పర్సు పోగొట్టుకున్న వ్యక్తికి చేరవేసే ఉద్దేశంతో ఏపీడబ్ల్యూజేఎఫ్ తెనాలి గ్రూపులో సమాచారం అందించి, యజమాని వివరాలు తెలిసిన వారు తనను సంప్రదించాలని కోరారు. అనంతరం స్థానిక రెండో పట్టణ పోలీసులకు కూడా విషయాన్ని తెలియజేశారు.
ఈ క్రమంలో పోలీసులు 24 గంటల్లోపే పర్సు యజమాని లీలా సాయి వెంకటేశ్వర శాస్త్రిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మంగళవారం సాయంత్రం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దాసరి రవీంద్రబాబు, యజమాని సమక్షంలో పర్సులోని వస్తువులను పరిశీలించి ఆయనకు అప్పగించారు.
పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి అందించిన అంబటి శ్యామ్ సాగర్ నిజాయితీని పలువురు అభినందించారు. అలాగే సత్వరమే స్పందించి పర్సును యజమానికి అందజేసిన రెండో పట్టణ పోలీసుల సేవలను ప్రశంసించారు.