ఉల్లి వ్యాపారం పేరుతో రూ.24 లక్షలకు టోకరా

స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్‌ మోసగాడు.

స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్‌ మోసగాడు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2024 నవంబర్‌లో గచ్చిబౌలికి చెందిన వ్యాపారి రవికాంత్‌కు వాట్సాప్‌ ద్వారా రాజేష్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను బెల్లంపల్లిలో చదివిన మీ స్కూల్‌మేట్‌నని, పాత వివరాలన్నీ చెప్పి నమ్మకం కల్పించాడు.

ఆ తర్వాత తాను అరుణాచల ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఉల్లి వ్యాపారం చేస్తున్నానని, ఇందులో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభం వస్తుందని, ఎలాంటి రిస్క్‌ ఉండదని నమ్మించాడు. దాంతో 2024 నవంబర్‌ 4న మొదటిసారి ఎస్‌బీఐ ఖాతా ద్వారా అతని అకౌంట్‌కు రూ.4లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత పలుమార్లు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా మరో రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు పంపాడు. మరిన్ని పెట్టుబడుల కోసం రాజేష్‌ ఒత్తిడి చేయడంతో స్నేహితుడి వద్ద రూ.10 లక్షలు అప్పుగా తీసుకుని మరీ పెట్టుబడుల రూపంలో పెట్టాడు.

అయితే, రెండు నెలలు రూ.2.22లక్షలు లాభాల రూపంలో రవికాంత్‌కు ఇచ్చిన రాజేష్‌.. ఆ తర్వాత ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం మానేశాడు. పెట్టుబడుల రూపంలో పెట్టిన రూ.26లక్షల్లో కేవలం రూ.2.22లక్షలు మాత్రమే వచ్చాయని, మరో రూ.24లక్షలను ఇవ్వకుండా మోసగించినట్లు బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సైబర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *