ఇండస్ట్రీకి ‘పెద్ది’ ఒక పెద్ద దిక్కు.. అక్కడే సినిమా సగం సక్సెస్ అయినట్టే.. జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంపై సీనియర్ నటుడు జగపతిబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమాలో తాను పోషించిన అప్పలసూరి పాత్ర కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైనదని అన్నారు. ‘అరవింద సమేత’ కంటే ఎక్కువ కష్టపడి ‘పెద్ది’ సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పానని తెలిపారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తోనే సినిమా సగం సక్సెస్ అయిందని, ప్రస్తుతం ఇండస్ట్రీకి ‘పెద్ది’ ఒక పెద్ద దిక్కు లాంటి సినిమా అని జగ్గుభాయ్ పేర్కొన్నారు.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, రవి కిషన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా జగపతి బాబు తాజా ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

‘పెద్ది’ సినిమాలో అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు నటించారు. ఈ క్యారెక్టర్ రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. ఎమోషనల్‌గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ తనకు చాలా నచ్చిన పాత్ర ఇదని జగపతి బాబు అన్నారు. అప్పలసూరి పాత్ర క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే దక్కుతుందన్నారు. తనది తండ్రి పాత్ర కాదని, చాలా ప్రేమతో అనుబంధంతో కూడిన పాత్ర అని వెల్లడించారు. రామ్ చరణ్ సినిమాలో ఈ పాత్ర చేయడం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని, సినిమా తమ మధ్య బ్యూటీఫుల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని తెలిపారు. అప్పలసూరి పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందన్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *